పెన్షన్ పండుగ..

  • లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
  • జిల్లాలో నెలకు రూ.120 కోట్ల పెన్షన్ల పంపిణీ
  • తిరుపతి నియోజకవర్గంలో 18,303 మందికి లబ్ధి

తిరుపతి, ఆంధ్రప్రభ : లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తోందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణంలోని ముత్యాలరెడ్డి పల్లిలో గల దుర్గానగర్‌లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక భద్రత కల్పించే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఒకటిగా నిలిచిందన్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే ప్రతి నెల సుమారు రూ.120 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు.

సంక్షేమానికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో సామాజిక భద్రతా పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచినట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో 18,303 మంది లబ్ధిదారులకు వివిధ కేటగిరీల కింద ప్రతి నెల రూ.8 కోట్ల 19 లక్షల మేర పెన్షన్లు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం నుంచే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ శారదాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply