లింగ నిర్ధారణ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయండి

  • పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ

శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1800 233 2447 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పుట్టపర్తి ఆర్డీవో పి. సువర్ణ తెలిపారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టం–1994 అమలుపై సబ్ డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశం ఆర్డీవో సువర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ శిశువు హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించడం, అలాంటి సేవలను ప్రచారం చేయడం, లింగ ఎంపికకు ప్రోత్సహించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆమె, లింగ నిర్ధారణ వల్ల సమాజంలో లింగ అసమానతలు పెరిగి ఆడ శిశువుల జనన నిష్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్లను సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ వారంలోనే పుట్టపర్తి డివిజన్‌లోని స్కాన్ సెంటర్లలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు ముమ్మర తనిఖీలు చేపడతామని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1800 233 2447 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రతి స్కాన్ సెంటర్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.

హాస్టళ్లలోని విద్యార్థులకు ఆరోగ్య విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత (అనీమియా) నివారణపై విస్తృత ప్రచారం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో డాక్టర్ గాయత్రి, డెమో సి. సుబ్రహ్మణ్యం, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జీఓ) ప్రతినిధులు పాల్గొన్నారు.