Karnataka | ప్రేమను నిరాకరించిందని ఘాతుకం?

Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళూరు సమీపంలోని బంట్వాల్ బస్టాండ్‌లో 21 ఏళ్ల యువతిని ఓ యువకుడు నడిరోడ్డుపైనే కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతురాలిని లావణ్యగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దూరపు బంధువైన చేతన్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బస్టాండ్‌లో లావణ్యపై కత్తితో దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తన ప్రేమను లావణ్య తిరస్కరించడంతో అక్కసుతోనే చేతన్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.