Hydrogen train | ప్రారంభించిన ప్రధాని మోదీ..

జింద్–సోనిపట్ మధ్య రెండు గంటల్లో ప్రయాణం


Hydrogen train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. హరిత రవాణా వ్యవస్థకు ఇది కీలక ముందడుగుగా నిలవనుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్–సోనిపట్ స్టేషన్ల మధ్య నడవనుంది. సుమారు రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకునేలా దీన్ని రూపొందించారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు ద్వారా భారత్ హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న దేశాల జాబితాలో చేరింది.

ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉండగా, ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడం వల్ల ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.