ఈశ్వరమ్మ యాదవ్‌ను పరామర్శించిన వి. శ్రీనివాస్ గౌడ్
వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్య
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇటీవల యాదాద్రి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఎల్‌బీనగర్‌లోని ఆమె నివాసంలో పరామర్శించారు.
ఇటీవల తనపై జరిగిన అనుచిత వ్యాఖ్యలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈశ్వరమ్మ యాదవ్ మనస్తాపానికి గురైన విషయం తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రజాసేవ చేసిన వారిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం, రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిత్వాన్ని కించపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ప్రజలకు సేవ చేసిన మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం పాటించాలని, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలకు తావు ఇవ్వకూడదని సూచించారు.
అదేవిధంగా చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుని హింసాత్మక చర్యలకు పాల్పడితే, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసు శాఖను కోరారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ఈశ్వరమ్మ యాదవ్ ధైర్యంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించిన శ్రీనివాస్ గౌడ్, ఆమెకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
