మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి
జనగణన, డిలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు..
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మహిళా సంఘాల జేఏసీ వినతి
మహిళా రిజర్వేషన్ల అమలుపై జేఏసీ డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో అనుసంధానం చేయడాన్ని జేఏసీ వ్యతిరేకించింది. ఈ నిబంధనలను తొలగించేలా రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరింది.
జేఏసీ తరఫున అందజేసిన వినతిపత్రంపై ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. జ్యోతి, పీఓడబ్ల్యూ-2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూప, సీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. జ్యోతి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లు స్వతంత్ర అంశమని, వాటిని ఇతర పరిపాలనా ప్రక్రియలకు ముడిపెట్టడం వల్ల అమలు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రిజర్వేషన్ల అమలుకు అవసరమైన సవరణలు తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉందని, త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలు అత్యంత అవసరమని జేఏసీ పేర్కొంది.
