Food Safety | గ్రాండ్ పసంద్‌కు ఫుడ్ సేఫ్టీ షాక్

ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై రెస్టారెంట్‌కు నోటీసులు
హబ్సిగూడ ‘గ్రాండ్ పసంద్’లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
కిచెన్‌లో పరిశుభ్రత లోపాలు, నిల్వ విధానాలపై అధికారుల అభ్యంతరాలు

Food Safety | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నగరంలోని హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ఆహార భద్రత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హబ్సిగూడలోని గ్రాండ్ పసంద్ రెస్టారెంట్‌ను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా రెస్టారెంట్‌లో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంటగది నిర్వహణ, ఆహార భద్రత నిబంధనల అమలును పరిశీలించారు. ఈ సమయంలో పలు లోపాలను గుర్తించిన అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

తనిఖీల్లో ఫుడ్ లైసెన్స్‌ను వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించకపోవడం, వంటగదిలో నూనె మరకలు ఉండటం, ఈగలు, బొద్దింకల సమస్య, చెత్త బుట్టలను మూత లేకుండా ఉంచడం, నీరు నిల్వ ఉండటం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. అలాగే ముడి ఆహార పదార్థాలను నేరుగా నేలపై నిల్వ చేయడం, పెస్ట్ కంట్రోల్‌కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడం, ఫ్రీజర్‌లో మంచు పేరుకుపోవడం వంటి లోపాలపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేలా రెస్టారెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.