గురుకుల పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ
- విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి..
- పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
చెన్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మశ్రీనివాస్ శుక్రవారం స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించిన ఆమె, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల పరిసరాలను పరిశీలించిన చైర్‌పర్సన్, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మైదానంలో చెత్త పేరుకుపోవడాన్ని గుర్తించిన ఆమె వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి శుభ్రపరిచేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా పద్మశ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
