దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..

దుర్గమ్మ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..

రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి..

భవానిపురం, ఆంధ్రప్రభ : దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గ గుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నూతన మాస్టర్ ప్లాన్ లో కేవలం కొండ దిగువ ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దీంతో పాటుగా దుర్గ గుడి వద్ద పైనున్న కొండను తొలగించి దుర్గగుడి వద్ద సమాంతరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

ఆ ప్రాంతంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కలుగ చేస్తే దుర్గగుడి మరింతగా శోభాయమానంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. దాదాపు 320 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ అభివృద్ధి పనులకు అదనంగా ఈ పనులను కూడా అభివృద్ధి చేస్తే భక్తులకు దేవస్థానంకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం మన అందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు.

కొండ విస్తీర్ణంతో పోలిస్తే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం చాలా తక్కువని వివరించారు. ఇంద్రకీలాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ సమాంతర రేఖలో కొండ భాగాన్ని చదును చేయడం ద్వారా కొత్త ప్రాంగణాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపరచవచ్చని తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన భవనం లాగే, ఇక్కడ కూడా కొండను తొలిచిన ప్రదేశంలో ఒక భారీ అన్నప్రసాద భవనాన్ని నిర్మించవచ్చన్నారు.

ఆధునిక వంటశాలలు, ఒకేసారి వేలమంది కూర్చునే డైనింగ్ హాల్స్ ఇందులో ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొండపైనే విశ్రాంతి తీసుకునేలా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా “క్లిఫ్ సైడ్” కాటేజీలు లేదా డార్మిటరీలు నిర్మించవచ్చనీ వివరించారు. కొండ కింద లేదా కొండ లోపలి భాగాన్ని ఉపయోగించుకుని భారీ మల్టీ-లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయవచ్చనీ ,దీనివల్ల ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గుతుందని వివరించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే కొండ దిగువ ప్రాంతంలో వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అలా కాకుండా కొండపై ప్రాంతాన్ని సమతలంగా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన వివరించారు. అమ్మవారి వైభవాన్ని చాటిచెప్పేలా శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించి, అక్కడ నిత్యం శాస్త్రీయ నృత్యాలు, వేద పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించవచ్చన్నారు. భక్తులకు ప్రశాంతతనిచ్చేలా ‘నక్షత్ర వనం’ లేదా ‘దుర్గా వనం’ పేరుతో పూల తోటలు, ఆయుర్వేద వనాలను పెంచవచ్చని పేర్కొన్నారు.

అలాగే “దివ్య కారిడార్” రూపేనా కృష్ణా నది స్నానఘట్టాల నుండి కొండపై ఉన్న అమ్మవారి గర్భాలయం వరకు ఒకే కారిడార్‌గా అభివృద్ధి చేయాలనీ, కొండను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు రద్దీ లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయంగానే కాకుండా, భారతదేశంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు.

Leave a Reply