వేలాది క్యాన్సర్‌ బాధితులకు ఊరటగా పాలియేటివ్‌ కేర్‌ సేవలు

వేలాది క్యాన్సర్‌ బాధితులకు ఊరటగా పాలియేటివ్‌ కేర్‌ సేవలు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న రోగులకు కేవలం మందులు మాత్రమే కాకుండా మానసిక ధైర్యం, నొప్పి నివారణ, కుటుంబ సభ్యుల అండ కూడా ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కామేశ్వర ప్రసాద్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులోని రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తున్న పాలియేటివ్‌ కేర్‌ సేవలు వేలాది మంది రోగులకు ఊరటగా నిలుస్తున్నాయని తెలిపారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహిస్తున్న పాలియేటివ్‌ కేర్‌ సెన్సిటైజేషన్‌, శిక్షణ కార్యక్రమాన్ని డా. కామేశ్వర ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు స్వాంతన, సంరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అందించడమే పాలియేటివ్‌ కేర్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కర్నూలు రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్‌ నొప్పి నివారణ, పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌ 2019 మే 19న ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరుపేదలు, చివరి దశ క్యాన్సర్‌ రోగులకు నొప్పి నివారణ, లక్షణాల నియంత్రణ, మానసిక పరామర్శ, కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశం వంటి సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా సుమారు 3,500 నుంచి 4,000 మంది రోగులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందినట్లు అధికారులు తెలిపారు.

కర్నూలు రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌కు యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ మెడికల్‌ ఆంకాలజీ గుర్తింపు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఈ గుర్తింపు ద్వారా కర్నూలు కేంద్రం అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. కెనడాకు చెందిన ట్రూ వరల్డ్‌ క్యాన్సర్‌ కలాబరేషన్‌ కేర్‌ యూనిట్‌, హైదరాబాద్‌ పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ సొసైటీ సహకారంతో ఈ సేవలు మరింత బలోపేతమయ్యాయని తెలిపారు.

క్యాన్సర్‌ చివరి దశలో తీవ్రమైన నొప్పులతో బాధపడే రోగులకు ప్రత్యేక మందుల అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు. కర్నూలు కేంద్రానికి అవసరమైన అనుమతులు ఉండటంతో రోగులకు సమర్థవంతమైన నొప్పి నివారణ చికిత్స అందుతోందన్నారు. ఈ సేవల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు కర్నూలు కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు కర్నూలు రాష్ట్ర క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను పాలియేటివ్‌ కేర్‌ శిక్షణకు నోడల్‌ కేంద్రంగా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల, హిందూపురం జిల్లా ఆసుపత్రికి చెందిన వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక పాలియేటివ్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. పాలియేటివ్‌ కేర్‌ అనేది కేవలం వైద్యం మాత్రమే కాదని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మానసిక బలం, కుటుంబ సభ్యులకు మార్గదర్శనం, నొప్పి నియంత్రణ, గౌరవప్రదమైన జీవన నాణ్యతను అందించే సమగ్ర వైద్య విధానమని పేర్కొన్నారు.

Leave a Reply