దోపిడీ కేసు ఛేదన..

దోపిడీ కేసు ఛేదన..
ఐదుగురు యువకులు అరెస్టు.
18 గ్రాముల బంగారం స్వాధీనం.
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.ఈ సంఘటనలో ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి,18 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని శనివారం స్టేషన్ ఆవరణలో సిఐ విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.129,సెక్షన్ 308(5) కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేసారు.
ఈ నెల 10వ తేదీన కొత్త రాజరాజేశ్వరి పేటలో ఆర్కే ఫంక్షన్ హాల్ వెనుక వీధిలో తాళ్లూరి సాయి తేజను బెదిరించి, కర్రతో దాడి చేస్తామని భయపెట్టి 18 గ్రాముల బంగారు గొలుసులు దోచుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, కమిషనర్ ఎస్. వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, వెస్ట్ జోన్, ఎడిసిపి జి. రామకృష్ణ, నార్త్ సబ్ డివిజన్, ఏసిపి పి. సత్యానందం పర్యవేక్షణలో సీఐ డి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్. ఐ.ఎస్. దుర్గా ప్రసాద్ ,అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బృందం కలిసి న్యూ ఆర్ఆర్ పేట కె. జి. ఎఫ్ అపార్ట్మెంట్స్ వెనుక ఖాళీ స్థలం వద్ద ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు ముందస్తు ప్రణాళికతో నేరానికి పాల్పడినట్లు, నిందితులు జడ మహేష్,ఎర్ర జొన్న అభిషేక్ అనువారు బాధితుడికి పరిచయస్తులు కావడంతో, అతడిని సరదాగా బయటికి వెళ్దాం అని నమ్మబలికి, కొత్త రాజరాజేశ్వరి పేట, ఆర్కే ఫంక్షన్ హాల్ వెనుక గల ఏకాంత వీధికి తీసుకొని వచ్చి, అదే సమయంలో ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం ఒక నిందితుడు అలిబెల్లి సత్యనారాయణ కొంత దూరంలో కాపలాగా ఉండగా, మరో ఇద్దరు నిందితులు అయినటువంటి శిలపరెడ్డి హేమంత్, గుమ్మడి సాయి విజయ్ గౌతమ్ అనువారు ఒక స్కూటర్ పై అక్కడికి వచ్చి , బాధితుడిని బెదిరించి, పక్కనే ఉన్న పెద్ద కర్రను చూపించి అతని మెడలో ఉన్న రెండు బంగారపు గొలుసులు బలవంతంగా ఇమ్మని లేకపోతే కొట్టి చంపేస్తామని బెదిరించారు.
ప్రాణభయంతో భయపడిన బాధితుడు రెండు బంగారపు గొలుసులు వారికి అప్పగించాడు. తదనంతరం నిందితులు స్కూటర్పై పరారయ్యారు. ఈనెల 18న వచ్చిన రహస్య సమాచారం మేరకు నిందితులను, రెండు బంగారు గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఈ కేసులో అదుపులోనికి తీసుకున్న ఐదుగురు నిందితులు (1) శిలపరెడ్డి హిమంత్, (2) గుమ్మడి సాయి విజయ్ గౌతమ్, (3) అలిబెల్లి సత్యనారాయణ @ శివా, (4) జాడ మహేష్, (5) ఎర్రజొన్న అభిషేక్ లను కోర్టు వారి ముందు హాజరు పరుస్తున్నట్టు తెలియజేశారు.
