దసరా నాటికి కొత్త టెర్మినల్ భవనం పూర్తి

విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని
విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరి కమిటీ సమావేశం
దుబాయ్, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులపై ప్రతిపాదనలు
విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి
వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్‌కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు కోరిన కమిటీ

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేశీయ, అంతర్ విమాన సర్వీసుల విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం తదితర అంశాలపై గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి కమిటీ చైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు.

అనంతరం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కోచైర్మెన్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందన్నారు. కొత్త టెర్మినల్‌ను దసరా నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం కొచ్చిన్‌కు నేరుగా విమాన సర్వీస్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు మరిన్ని విమాన సర్వీసులు అవసరమని కమిటీ అభిప్రాయపడిందన్నారు.

విజయవాడ నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైతే అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలసౌరి కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, వైస్ చైర్మన్ ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.