గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డంగా పెట్టుకుని డిలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావాలని, జనగణన, కులగణన నిర్వహించకుండా కుటిల ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023లో ఆమోదం పొందినా, దానిని అమలు చేయకుండా మహిళలకు రావలసిన హక్కులను వాయిదా వేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ మహిళలకు న్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఇండియా కూటమి పార్టీలపై అనవసర ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, ఎన్డీఏ కూటమికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, 2023 మహిళా బిల్లును వెంటనే అమలు చేసి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే ప్రధానమంత్రి, హోం మంత్రి వంటి కీలక పదవులను మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డి. రమేష్ బాబు, చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు టిక్కి రాయల్, కోఆర్డినేటర్లు పూతలపట్టు ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు బుల్లెట్ రవి, వెంకటేష్, సెల్వం, మహిళా నాయకులు కుమారి, అంబికా, తేజ, శ్రీనివాసులు, ఖాదర్బాషా, అక్బర్, సుమంత్ తదితరులు, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు హాజరై నిరసన తెలిపారు.
