ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దు..

  • 4 వేల సొంత బస్సులు కొనాలి: ఉద్యోగ సంఘాల జేఏసీ
  • ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వానికి డిమాండ్
  • 10 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి
  • వేలాది మంది ఉద్యోగుల సంతకాలతో కలెక్టర్‌కు వినతిపత్రం
  • ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు సమకూర్చాలని డిమాండ్
  • 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించి.. 12వ పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని కోరింపు
  • ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని జేఏసీ పిలుపు

( విజయవాడ, ఆంధ్రప్రభ) : ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వ రంగ ప్రజా రవాణా వ్యవస్థను బలహీనపరుస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకుని 4 వేల సొంత బస్సులు కొనుగోలు చేయడంతో పాటు 10 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని ఉపసంహరించుకుని ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా మరింత బలోపేతం చేయాలని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఉద్యోగుల వేలాది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీకి సమర్పించింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా రవాణా సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఆర్టీసీ భవిష్యత్తుతో పాటు వేలాది మంది ఉద్యోగుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం “స్త్రీ-శక్తి” పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల సేవల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.

ఆర్టీసీలో సుమారు 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదవీ విరమణలతో సిబ్బంది కొరత మరింత పెరుగుతోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సాంకేతిక సిబ్బంది సహా అన్ని కేటగిరీల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే స్క్రాప్‌కు వెళ్తున్న పాత బస్సుల స్థానంలో ప్రభుత్వం సొంతంగా 4 వేల కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థకు అందించాలని కోరారు.

విద్యుత్ బస్సుల నిర్వహణ, డ్రైవింగ్, కండక్టర్ విధులు, మెయింటెనెన్స్ తదితర కార్యకలాపాలను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని జేఏసీ స్పష్టం చేసింది. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర ఉపశమనం (ఐఆర్) ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన ఆర్థిక సహాయం అందించి, ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా, జోన్, డిపో నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.