తల్లిపాలే శిశువు జీవితానికి అమృతధార..

శిశువు ఆరోగ్య‌క‌ర ఎదుగుదలకు సహజ వరం
మొద‌టి ఆర్నెల్లు త‌ల్లిపాలు మాత్ర‌మే అందించాలి
ఆరోగ్య సిబ్బంది విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌


(విజయవాడ, ఆంధ్రప్రభ) : తల్లిపాలే శిశువు ఆరోగ్య‌క‌ర జీవితానికి అమృతధార అని.. మొదటి ఆరు నెలల వరకు వాటిని మాత్రమే అందించడం ద్వారా శిశువుకు సంపూర్ణ పోషకాహారం, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తాయ‌ని.. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్య వరమని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్ర‌పంచ తల్లిపాల వారోత్సవాలు (ఆగ‌స్టు 1 – ఆగ‌స్టు 7) సంద‌ర్భంగా సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రుల‌తో క‌లిసి గోడ పత్రికను, పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు.. ఇతివృత్తంతో త‌ల్లిపాల వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ త‌ర్వాత మాత్రమే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాల‌న్నారు. పుట్టిన గంట‌లోపే త‌ల్లిపాలు ఇవ్వ‌డాన్ని ప్రారంభించాల‌ని.. గోల్డెన్ అవర్‌లో వాటిని ఇవ్వ‌డం వ‌ల్ల శిశువుల ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. వ్యాధి నిరోధక శక్తి, పెరుగుతుందని పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి ఇవి ప్రకృతి ప్రసాదించిన అమూల్య వరమని, త‌ల్లిపాల విశిష్ట‌త‌పై క్షేత్ర‌స్థాయి ఆరోగ్య సిబ్బంది విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, డీఎంహెచ్‌వో డా. ఎ.శ్రావ‌ణ‌బాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శ‌ర‌త్‌బాబు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం త‌దిత‌రులు పాల్గొన్నారు.