లక్ష్యంతో చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు
అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల టౌన్, ఆంధ్రప్రభ: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు తదితర నిల్వ పదార్థాలను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.
తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు.
ఈ సందర్భంగా గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
విరామ సమయంలో ఆటలు ఆడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.
