రేణిగుంట గిరిజన హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

  • పరిశుభ్రత, నాణ్యమైన భోజనం, మౌలిక వసతుల్లో లోపాలపై ఆగ్రహం
  • అపరిశుభ్ర ఆవరణపై అసంతృప్తి
  • యూనిఫాం, హాస్టల్ నిర్వహణలో లోపాల గుర్తింపు
  • మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశం
  • అన్ని లోపాలు సరిచేయాలని హెచ్చరిక

తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ: రేణిగుంటలోని ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, హాస్టల్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని ఇతర పాఠశాలలతో పోలిస్తే విస్తీర్ణమైన స్థలం ఉన్నప్పటికీ పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా తరగతి గదులు, హాస్టల్ గదులు, రక్షిత తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.

నిర్వహణ ఇలాగేనా?

హాస్టల్ గదుల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పాటు లైట్లు, ఫ్యాన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూనిఫాంలు, షూలు విద్యార్థులకు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కనీసం యూనిఫాంలు కూడా సక్రమంగా లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం తప్పనిసరిగా అందించాలని హెచ్చరించారు.

పునరావృతం కాకూడదు..

విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీసి, లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాల, హాస్టల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తాను మళ్లీ తనిఖీ చేసేలోపు ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను హెచ్చరించారు. ఈ తనిఖీలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపల్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.