Rain | పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- రానున్న మూడు గంటలు అప్రమత్తం
- విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- పిడుగులతో కూడిన మోస్తరు వర్షాల సూచన
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు గంటల పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అరకు, చింతపల్లె, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముండటంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు వర్షం ప్రారంభమైన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
అదేవిధంగా చెట్ల కింద నిలబడకుండా, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, నీటి వనరులకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, అవసరమైతే విపత్తుల నిర్వహణ శాఖ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు.
వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.
