తీవ్ర వాతావరణాల్లో కార్మికుల రక్షణకు కేంద్ర చర్యలు
లోక్‌సభలో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారీ వర్షాలు, వరదలు, వడగాల్పులు, తుఫానులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం నుంచి అసంఘటిత, దినసరి కూలీలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశవ్యాప్తంగా సంభవిస్తున్న తీవ్ర వాతావరణ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ నమోదు చేస్తోందని మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, వివిధ రంగాల్లో అనుకూలతను పెంచడం లక్ష్యంగా కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ వాతావరణ అనుసరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
వడగాల్పుల సమయంలో కార్మికుల రక్షణ కోసం కేంద్ర కార్మిక శాఖ దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ అడ్వైజరీలు జారీ చేస్తోందని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ పరిశోధనా సంస్థల సహకారంతో వాతావరణ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసిందన్నారు.
రాష్ట్రాల్లో హీట్ యాక్షన్ ప్లాన్లు అమలు చేయడంతో పాటు కాలానుగుణ, నెలవారీ, దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు, జిల్లాల వారీగా హీట్‌వేవ్ ప్రమాద మ్యాపులు, హాట్ వెదర్ హజార్డ్ మ్యాపులు రూపొందిస్తున్నట్లు వివరించారు. వేసవి ప్రారంభానికి ముందు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విపత్తుల నిర్వహణకు విపత్తు నిర్వహణ చట్టం–2005, జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక మార్గదర్శకాలుగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆర్థిక సాయం అందించే ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రం అవసరమైన ఆర్థిక, సాంకేతిక, లాజిస్టిక్ సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది.
వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి కేంద్రం గుర్తించిన 12 ప్రకృతి విపత్తుల సందర్భాల్లో బాధితులకు రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం అత్యధికంగా అసంఘటిత, దినసరి కూలీలపై పడుతోందన్నారు. కేంద్రం చేపడుతున్న హీట్‌వేవ్ అడ్వైజరీలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అభినందనీయమైనప్పటికీ, ప్రభావిత కార్మికులకు ఉపాధి భద్రత, సామాజిక రక్షణ, తక్షణ ఆర్థిక సహాయం అందించే సమగ్ర విధానాలు అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు.
