వేద విద్యార్థుల మృతి బాధాకరం: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి మండలం యండ్రాయి గ్రామంలోని వేద పాఠశాలకు చెందిన ఇద్దరు వేద విద్యార్థులు గోమాతను కాపాడే ప్రయత్నంలో చెరువులో మునిగి మృతి చెందడం అత్యంత విషాదకరమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతులైన బమిడి శివనాగ సుబ్రహ్మణ్య మణిశర్మ (17), కొడవటికంటి కిరణ్ (18) మూగజీవాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం వారి మానవత్వానికి, సేవాభావానికి నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. అయితే అదే ప్రయత్నంలో వారి అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీరని దుఃఖాన్ని భరించే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారి కుటుంబాలకు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి కాళేశ్వర సుప్రదీప్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా విద్యాసంస్థలు, గోశాలలు, చెరువులు, ఇతర నీటి వనరుల పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు.
