ఓటరు జాబితాల సమగ్ర సవరణపై రాష్ట్రస్థాయి సమీక్ష
ఓటరు జాబితాల సమగ్ర సవరణపై రాష్ట్రస్థాయి సమీక్ష
గడువులోగా మ్యాపింగ్ పూర్తి చేయాలి.. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశం
నరసరావుపేట, ఆంధ్రప్రభ: ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయం నుంచి జరిగిన ఈ సమీక్షకు స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, చేర్పులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి సర్వే ద్వారా పరిశీలిస్తున్నారని వివరించారు.
బూత్ స్థాయి అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన చేపట్టి ఓటరు జాబితాల నాణ్యతను మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్‌వోలకు సమగ్ర శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు లేదా సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేయాలని, జిల్లాలో ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
