భారీ ఫ్లెక్సీలతో ప్రజల ప్రాణాలకు ముప్పు..
- చిలకలూరిపేటలో నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆందోళన
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట పట్టణంలో ఇటీవల గాలులకు భారీ ఫ్లెక్సీలు ఊడిపడి రోడ్డుపై పడుతున్న ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ రాజకీయ, వాణిజ్య ఫ్లెక్సీలు నిబంధనలకు విరుద్ధంగా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పు కాకపోయినా, వాటిని బలమైన ఇనుప నిర్మాణాలతో, గాలి వేగాన్ని తట్టుకునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది.
అయితే అనేక చోట్ల నాసిరకం నిర్మాణాలతో, సరైన బిగింపులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్వల్ప గాలికే ఊడి పడుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు పెద్ద ప్రమాదాలకు హెచ్చరికగా నిలుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమగ్ర చర్యలు చేపట్టకపోవడం ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. నేడు అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా, రేపు అదే ఫ్లెక్సీ ఓ ద్విచక్ర వాహనదారిపై, పాదచారిపై లేదా నాలుగు చక్రాల వాహనంపై పడితే జరిగే నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చిలకలూరిపేటలో ఫ్లెక్సీల నియంత్రణ పూర్తిగా గాడి తప్పిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంట, మున్సిపల్ పరిధిలో అనుమతులు, భద్రతా ప్రమాణాలు, గడువు ముగిసిన ఫ్లెక్సీల తొలగింపు వంటి అంశాలపై కఠిన పర్యవేక్షణ కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రచారానికి పెద్దపీట వేస్తూ ప్రజల ప్రాణ భద్రతను విస్మరిస్తున్నారనే విమర్శలు మున్సిపల్ అధికారులపై వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ప్రచారమే ముఖ్యమా అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పురపాలక సంఘం అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జాతీయ రహదారులపై ప్రమాదకరంగా ఉన్న అన్ని భారీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించి, భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు పాటించని ఫ్లెక్సీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వాసం నెలకొంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
