దైవానుగ్రహం పొందేలోపే దురదృష్టం వెక్కిరింపు.!

  • జిల్లా కోర్టు సెంటర్‌లో రోడ్డు ప్రమాదం
  • వేగంగా దూసుకొచ్చిన పల్సర్ బైక్ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, పల్సర్ ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న మహిళను బలంగా ఢీకొట్టారు.

ఢీకొట్టిన వేగానికి మహిళ రోడ్డుపై ఎగిరిపడి తీవ్రంగా గాయపడగా, వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమీపంలోని సాయిబాబా ఆలయానికి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికులను కలచివేసింది.

నగరంలో పెరుగుతున్న నిర్లక్ష్య డ్రైవింగ్

ఇటీవల నగరంలో యువకులు ద్విచక్ర వాహనాలపై అతివేగంగా ప్రయాణించడం, డబుల్, ట్రిపుల్ రైడింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, పాఠశాలలు విడిచే సమయాల్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కోర్టు సెంటర్ వంటి రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.