పాకాలపాడులో… కార్డెన్ సెర్చ్…!
పల్నాడు ప్రతినిధి, జూలై 30, (ఆంధ్రప్రభ): పల్నాడు జిల్లాలో రానున్న లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐజీ ఆదేశాల మేరకు, సత్తెనపల్లి డీఎస్పీ పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ మండలం, పాకాలపాడు గ్రామంలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తనపల్లి రూరల్ సర్కిల్ సీఐ యం.హైమా రావు మాట్లాడుతూ…గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనదారులు సంబంధిత బండి పత్రాలను చూపించినట్లయితే వాహనాలను తిరిగి అప్పగిస్తామని, లేనిపక్షంలో కోర్టుకు పెడతామని గ్రామస్తులకు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. యువత గంజాయి, మద్యపానం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
రానున్న మున్సిపల్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేందుకు ప్రజలు, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గతంలో గొడవల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి, రౌడీ షీట్లు కూడా తెరిచినట్లు సీఐ హైమారావు గుర్తు చేశారు. చిన్న, చిన్న గొడవలు జీవితాంతం ఇబ్బందులకు దారి తీస్తాయని, ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అదే విధంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం ఉండాలని, అనధికార వ్యక్తులు పంపే లింకులను, అనధికార వెబ్సైట్లు ఓపెన్ చేయవద్దని, అలాంటి లింకులు ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లోని నగదు కోల్పోయే ప్రమాదం ఉందని సిఐ హైమారావు సూచించారు. గ్రామస్తులు రాత్రివేళలో దొంగతనాలు జరుగుతున్నాయని పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లను, విద్యుత్ వైర్లను తస్కరించికెళ్తున్నారని సిఐ హైమారావ్ దృష్టికి తీసుకెళ్ళగా, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ను మరింతగా పెంచుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
