మంత్రి వివేక్ వెంకటస్వామి
పరిశ్రమల్లో భద్రతపై రాజీ లేదు
కాంట్రాక్ట్ కార్మికులతో రిస్కీ పనులు చేయించొద్దు
సిగాచి ఘటన పరిశ్రమలకు గుణపాఠం కావాలి
భద్రతపై కఠిన నిబంధనలు తీసుకొస్తాం
ప్రమాదాల నివారణపై ప్రభుత్వం సీరియస్:
మంత్రి వివేక్ వెంకటస్వామి
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయించొద్దని పరిశ్రమలకు హెచ్చరిక జారీ చేశారు.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శక్తి, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులు సమన్వయంతో పనిచేసి బలమైన సేఫ్టీ సంస్కృతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ)లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టిబుల్ డస్ట్స్’ జాతీయ స్థాయి రెండు రోజుల వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబస్టిబుల్ డస్ట్‌పై రూపొందించిన ప్రత్యేక గ్రంథాన్ని ఆవిష్కరించారు.
భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలి
కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ఇప్పటికే సమగ్ర భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలకు ప్రభుత్వం స్వేచ్ఛ కల్పించినప్పటికీ, ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ జోక్యం కోసం ఎదురుచూడకుండా పరిశ్రమలు స్వచ్ఛందంగా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
సిగాచి ఘటన గుణపాఠం కావాలి
ఇటీవల జరిగిన సిగాచి పరిశ్రమ ప్రమాదం ప్రతి పరిశ్రమకు హెచ్చరికగా నిలవాలని మంత్రి అన్నారు. భద్రతా చర్యల కోసం రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడంతో పాటు సంస్థకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. స్వల్ప వ్యయాన్ని ఆదా చేయాలనే ఆలోచన చివరకు భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకొస్తుందని హెచ్చరించారు.
బోర్డు సమావేశాల్లో భద్రతపై సమీక్ష తప్పనిసరి
ప్రతి పరిశ్రమలో జరిగే బోర్డు సమావేశాల్లో పారిశ్రామిక భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు, బోర్డు సభ్యులు భద్రతా ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, భద్రత కోసం చేసే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలని అన్నారు.
కార్మికులకు నిరంతర శిక్షణ అవసరం
పరిశ్రమల్లో భద్రత పెరిగితే కార్మికుల్లో విశ్వాసం పెరిగి ఉత్పాదకత కూడా గణనీయంగా మెరుగవుతుందని మంత్రి తెలిపారు. కార్మికులకు తరచూ భద్రతా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, ఆధునిక సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులను పరిశ్రమల్లో అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం, పరిశ్రమలు పరస్పరం అనుభవాలను పంచుకునేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయని చెప్పారు.
రిస్కీ విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు నో
ప్రమాదకర విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించవద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిగాచి ఘటనలో ప్రమాదకర విభాగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు తగిన శిక్షణ, అనుభవం లేకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణమని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో ప్రమాదకర కార్యకలాపాలు జరిగే విభాగాల్లో కంపెనీల శాశ్వత ఉద్యోగులే పనిచేసేలా నిబంధనలు రూపొందించాలని ఫ్యాక్టరీల శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలి
కంబస్టిబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదకర పరిస్థితుల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు రూపొందించి అన్ని పరిశ్రమల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. కార్మికుల ప్రాణ భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, ఫ్యాక్టరీల శాఖ డైరెక్టర్ మోహన్‌బాబు, నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, వివిధ పరిశ్రమలకు చెందిన సీనియర్ అధికారులు, నిపుణులు, సిమెంట్, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో పాటు సుమారు 300 మంది పాల్గొన్నారు.
