పోలీసుల ఉత్సాహానికి క్రికెట్ కిక్…
పోలీసుల ఉత్సాహానికి క్రికెట్ కిక్…
మైదానంలోకి దిగిన కర్నూలు, నంద్యాల ఎస్పీలు.
ఫ్రెండ్లీ మ్యాచ్‌తో సిబ్బందిలో ఉత్సాహం.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఆదివారం కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీసు సిబ్బందికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లా పోలీసు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఇరు జిల్లాల ఎస్పీలు కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా మైదానంలోకి దిగి క్రికెట్ ఆడుతూ సిబ్బందిని ఉత్సాహపరిచారు.

కర్నూలు జిల్లా పోలీసు జట్టుకు విక్రాంత్ పాటిల్ కెప్టెన్‌గా వ్యవహరించగా, నంద్యాల జిల్లా పోలీసు జట్టుకు సునీల్ షొరాణ్ నాయకత్వం వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో నంద్యాల జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి క్రీడలు ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. పోలీసుల ఒత్తిడిని తగ్గించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మ్యాచ్‌ను నిర్వహించామని తెలిపారు.

సునీల్ షొరాణ్ మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లా పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించామని చెప్పారు. క్రీడలు ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు సుధాకర్, శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
