Wimbledon విజేతలకు జాక్‌పాట్.. రికార్డు ప్రైజ్ మనీ !!

Wimbledon విజేతలకు జాక్‌పాట్.. రికార్డు ప్రైజ్ మనీ !!

  • రూ.740 కోట్ల బహుమతి నిధి ప్రకటింపు
  • సింగిల్స్ విజేతలకు రూ.41.5 కోట్లు..
  • క్వాలిఫయింగ్ ఆటగాళ్లకూ భారీ ప్రోత్సాహకాలు
  • కోవిడ్ తర్వాత టెన్నిస్ అభివృద్ధికి రూ.11,500 కోట్ల పెట్టుబడి
  • వింబుల్డన్‌లో ఆటగాళ్ల కోసం అత్యాధునిక సదుపాయాలు

ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రఖ్యాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్-2026 (Wimbledon) కోసం రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) గురువారం విడుదల చేసిన ప్రకటనలో మొత్తం బహుమతి నిధిని £64.2 మిలియన్లు (సుమారు రూ.740 కోట్లు)గా నిర్ణయించినట్లు వెల్లడించింది. గత ఏడాది £53.5 మిలియన్లు (సుమారు రూ.617 కోట్లు)తో పోలిస్తే ఇది £10.7 మిలియన్లు (సుమారు రూ.123 కోట్లు) ఎక్కువ. ఏకంగా 20 శాతం పెంపు కావడం విశేషం. వింబుల్డన్ చరిత్రలో ఒకే ఏడాదిలో జరిగిన అతిపెద్ద ప్రైజ్ మనీ పెంపు ఇదేనని నిర్వాహకులు పేర్కొన్నారు.

విజేతలకు రూ.41 కోట్లకుపైగా..

మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో విజేతలకు ఒక్కొక్కరికి £3.6 మిలియన్లు (సుమారు రూ.41.5 కోట్లు) అందజేయనున్నారు. ఇది కూడా గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికం. అలాగే రన్నరప్‌లకు £1.8 మిలియన్లు (సుమారు రూ.20.7 కోట్లు) లభించనున్నాయి. టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించే ఆటగాళ్లకు కూడా £80,000 (సుమారు రూ.92 లక్షలు) ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం పెరుగుదల.

క్వాలిఫయింగ్ రౌండ్‌కూ భారీ ప్రోత్సాహం

వింబుల్డన్ క్వాలిఫైయింగ్ పోటీల కోసం మొత్తం £6.2 మిలియన్ల (సుమారు రూ. 71.5 కోట్లు) ప్రైజ్ మనీని కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 25 శాతం అధికం. మహిళల, పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలకు 10 శాతం అదనపు ప్రైజ్ ఫండ్‌ను ప్రకటించగా, వీల్‌చైర్, క్వాడ్ వీల్‌చైర్ విభాగాలకు 20 శాతం పెంపును అందించారు.

కోవిడ్ తర్వాత రూ.11 వేల కోట్లకు పైగా పెట్టుబడి

కోవిడ్ మహమ్మారి తర్వాత టెన్నిస్ అభివృద్ధి కోసం దాదాపు £1 బిలియన్ (సుమారు రూ.11,500 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వెల్లడించింది. ఈ నిధులను ప్రైజ్ మనీ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి, గడ్డి కోర్టు సీజన్‌కు మద్దతు, బ్రిటిష్ మరియు అంతర్జాతీయ టెన్నిస్ అభివృద్ధికి వినియోగించినట్లు తెలిపింది.

ఆటగాళ్ల కోసం అత్యాధునిక సదుపాయాలు

వింబుల్డన్-2027 నాటికి పూర్తి కానున్న మిలీనియం బిల్డింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆటగాళ్ల కోసం మరింత విశాలమైన జిమ్, మెరుగైన వైద్య, రికవరీ సదుపాయాలు, న్యూట్రిషన్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రేన్స్ పార్క్‌లో ప్రత్యేక కమ్యూనిటీ టెన్నిస్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తూ, ప్రధాన వేదికకు దూరంగా ఆటగాళ్లు ప్రశాంతంగా సాధన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చైర్ డెబోరా జెవాన్స్ మాట్లాడుతూ.. వింబుల్డన్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆటగాళ్లు కూడా ఆ విజయ ఫలితాల్లో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతోనే ప్రైజ్ మనీని భారీగా పెంచినట్లు తెలిపారు.

గత పదేళ్లలో సింగిల్స్ విజేతల ప్రైజ్ మనీ 80 శాతం పెరిగిందని, తొలి రౌండ్‌లోనే ఓడిపోయే ఆటగాళ్లకు ఇచ్చే బహుమతి 160 శాతం పెరిగిందని వెల్లడించారు. వింబుల్డన్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీతో 2026 టోర్నమెంట్ జరగనుండటం ప్రపంచ టెన్నిస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply