కాంట్రాక్టు వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే గిత్త జయసూర్య
- ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చిన కాంట్రాక్టు సిబ్బంది
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది బుధవారం స్థానిక శాసనసభ్యులు గిత్త జయ సూర్య ని మర్యాదపూర్వకంగా కలిసి తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లను ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ వేతనం ఇవ్వాలని కోరారు.
విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తూ వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలన్నారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేసి వారి కుటుంబాలకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఐదు సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేటగిరీలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించామని ఉద్యోగ భద్రత కల్పించాలని వినయపూర్వకంగా విన్నవించారు. సిబ్బంది విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గిత్త జయ సూర్య కాంట్రాక్టు సిబ్బంది డిమాండ్లను వెంటనే ప్రభుత్వం దృష్టికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
