డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
- ఎమ్మెల్యే గద్దె రామమోహన్
(కృష్ణాలంక, ఆంధ్రప్రభ) : డీఎస్సీ నియామక ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించి 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆరోపించారు. డీఎస్సీపై చేస్తున్న అవాస్తవాలను ప్రజలు నమ్మకుండా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ జూనియర్ కళాశాలలో దమ్మాలపాటి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిఫాంల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టామని, మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక పాలన కారణంగానే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారని గద్దె రామమోహన్ విమర్శించారు. కార్యక్రమంలో దమ్మాలపాటి రంగారావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రతి ఏడాది అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
