“బాబూ… టిఫిన్ బాగుందా?

“బాబూ… టిఫిన్ బాగుందా?
అన్న క్యాంటీన్లలో కమిషనర్ ఆత్మీయ పరామర్శ…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సాధారణ ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్న క్యాంటీన్లలో ప్రత్యక్షంగా అల్పాహారం చేసి సేవల నాణ్యతపై ఆరా తీశారు. బుధవారం ఉదయం కొండారెడ్డి బురుజు సమీపంలోని అన్న క్యాంటీన్‌తో పాటు ముజఫర్‌నగర్ రోడ్డులో ఉన్న మరో క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించిన అనంతరం ముజఫర్‌నగర్ రోడ్డులోని క్యాంటీన్‌లో స్వయంగా టోకెన్ తీసుకుని అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో కమిషనర్ ఆత్మీయంగా ముచ్చటించారు. “టిఫిన్ బాగుందా? ప్రతిరోజూ ఇక్కడికే వస్తారా? సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు?” అంటూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలతో కలిసి కూర్చొని అల్పాహారం చేస్తూ, వంటకాల రుచి, నాణ్యతపై ప్రత్యక్షంగా పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాల్లో తిరుగుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.

తాగునీటిని శుభ్రమైన ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలని, డస్ట్‌బిన్‌లను ప్రతిరోజూ శుభ్రపరచాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లలో భోజనం చేసే ప్రతి ఒక్కరు సంతృప్తి చెందేలా నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ సేవలను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, లోకేష్, ఎంజల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

