జూకల్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్

5 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 20 వాహనాలకు జరిమానాలు

చిట్యాల, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిట్యాల సీఐ డి. మల్లేష్ ఆధ్వర్యంలో బుధవారం జూకల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని, వీధులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోదాల సమయంలో పొనగంటి చంద్రయ్య అనే వ్యక్తి వద్ద నుంచి 5 లీటర్ల అక్రమ గుడుంబాను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని 20 వాహనాలకు జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా సీఐ డి. మల్లేష్ గ్రామస్తులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువత చెడు సావాసాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో పయనించాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందిస్తున్నామని, గ్రామంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్, ఎస్సై-2 రాజన్ కుమార్, ఏఎస్సై ఈశ్వర్యతో పాటు 20 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.