క్రీడా కోటాలో నకిలీ సర్టిఫికెట్ల మాఫియా.. గాంధీవ ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్

  • జూడో, అథ్లెటిక్స్, సాఫ్ట్‌బాల్, వాల్‌బ్యాడ్మింటన్ సంఘాల్లో భారీ అక్రమాలు
  • నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలు
  • 38, 41 ఏళ్ల వయస్సులో కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం
  • గాంధీవ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగంపై హైకోర్టు విచారణ
  • స్కిల్ టెస్ట్ నిర్వహించి అనర్హులను తొలగించాలి
  • సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించాలి
  • ఏపీ ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు, క్రీడా ధ్రువపత్రాల జారీ, గాంధీవ ప్రాజెక్టు అమలులో భారీ అక్రమాలు జరిగాయని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017 నుంచి ఈ అక్రమాలపై ప్రభుత్వానికి, విజిలెన్స్‌కు, డీజీపీ, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదన్నారు. జంతు సంరక్షణ శాఖ, గ్రామ సచివాలయాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. 2023లో జంతు సంరక్షణ శాఖ నియామకాలలో సుమారు 200 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు లభించగా, వారిలో 70 నుంచి 100 మంది వరకు నకిలీ ధ్రువపత్రాలతో ఎంపికయ్యారని పేర్కొన్నారు.

డాక్టర్ చందన, రేవంత్ కుమార్, సాయిప్రదీప్, హర్షవర్ధన్ పేర్లతో ఉన్న ధ్రువపత్రాల ప్రామాణికతపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో మొత్తం 382 మంది ఎంపికయ్యారని, అందులో జూడో విభాగంలో ఎంపికైన 32 మందిలో ఇద్దరు మాత్రమే నిజమైన క్రీడాకారులని, మిగిలిన 30 మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. 2013లో జరిగిన జూడో పోటీల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఉపయోగించారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.

అథ్లెటిక్స్‌లో 38 ఏళ్ల మహిళ స్టీపుల్‌చేజ్‌లో రాష్ట్ర విజేతగా, 41 ఏళ్ల మహిళ జావెలిన్ త్రోలో రాష్ట్ర స్థాయి విజేతగా చూపించి ఉద్యోగాలు పొందినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చదువుకునే దశలో ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనని వ్యక్తులు రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎలా గుర్తింపు పొందారో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే తరహాలో సాఫ్ట్‌బాల్, వాల్‌బ్యాడ్మింటన్ తదితర క్రీడా సంఘాల్లోనూ నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆరోపించారు.

గాంధీవ ప్రాజెక్టులో భారీ అక్రమాలు..

2018లో ప్రారంభమైన గాంధీవ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద క్రీడా స్కామ్‌లలో ఒకటని పురుషోత్తం ఆరోపించారు. క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని, పిల్లల ఎంపిక, శిక్షణ, అకాడమీ నిర్వహణ జరగకుండానే నిధులు మళ్లించారని విమర్శించారు. ప్రాజెక్టు అమలులో అథ్లెటిక్స్ అసోసియేషన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోందని తెలిపారు. త్వరలో ఈ వ్యవహారాన్ని సీబీఐ లేదా సీఐడీకి అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

స్కిల్ టెస్ట్ జరిపించాల్సిందే..

స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులకు తప్పనిసరిగా స్కిల్ టెస్ట్ నిర్వహించాలని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్కే పురుషోత్తం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీలో సమూల ప్రక్షాళన చేపట్టి, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, నిజమైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.