జిల్లా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్‌కు ఘనారంభం..

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్‌ను మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జి. వెంకటేష్ శుక్రవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. పరుగు పందెం ట్రాక్ వద్ద సిద్ధంగా ఉన్న యువ అథ్లెట్లను ఆయన ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా టి.జి. వెంకటేష్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, పట్టుదలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు, నాణ్యమైన శిక్షణ అందించేందుకు క్రీడా సంఘాలు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు, కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బి. రామాంజనేయులు, అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజ్ శెట్టి, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు జి. సురేంద్ర, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్టర్, క్రీడా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థి అథ్లెట్లు పాల్గొన్నారు.