సీఎం బాబు విజన్ తో తీర్చిదిద్దుతున్నాం: ఏపీటీడీసీ చైర్మన్
- ప్రపంచ శాంతి, ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగమే వారధి
- వైద్య, బౌద్ధ, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యం
- అమరావతిని ప్రపంచ బౌద్ధ యాత్రా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
- ఏపీలో పెట్టుబడులకు ప్రపంచ సంస్థలకు ఏపీటీడీసీ సాదర ఆహ్వానం
- వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీలో ఏపీ పర్యాటక విజన్ వివరించిన ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు డా. నూకసాని బాలాజీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, వైద్య పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి, సుస్థిర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగమే కీలక వారధి అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త శకం ప్రారంభమైందని తెలిపారు.
అమరావతి, నాగార్జునకొండ, బుద్ధవనం, మహాచైత్యాన్ని సమగ్ర బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసి, అమరావతిని ప్రపంచ బౌద్ధ యాత్రా, ధ్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని చెప్పారు. తిరుమల, శ్రీశైలం, అరకు, గండికోట, బెలుం గుహలు, లంబసింగి, పాపికొండలు తదితర పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ఆధ్యాత్మిక, వైద్య, వెల్‌నెస్, బీచ్, ఎకో, అడ్వెంచర్, గ్రామీణ, గిరిజన, ఎంఐసీఈ పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కృత్రిమ మేధస్సు (ఏఐ), స్మార్ట్ టెక్నాలజీ ఆధారంగా ప్రపంచస్థాయి పర్యాటక అనుభూతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు, హాస్పిటాలిటీ, వైద్య, పర్యాటక రంగ ప్రతినిధులు ముందుకు రావాలని డా. నూకసాని బాలాజీ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌కు రండి… మా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రకృతి వైభవాన్ని ఆస్వాదించండి… రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి” అని ప్రపంచ ప్రజలకు చైర్మన్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.


