అరుదైన పక్షిని గుర్తించిన శాస్త్రవేత్తలు
అంతమైపోకుండా ఇప్పటికే సంచరిస్తున్న పక్షి
బర్డ్ అట్లాస్-2లో బయటపెట్టిన పరిశోధకులు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో చర్చ
పక్షి ఉందనే విషయాన్ని స్పష్టం చేసిన
ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి
కూత వినడమే కానీ, కనిపించలేదంటున్న గిరిజనులు
హైదరాబాద్ , ఆంధ్రప్రభ:
ట్వీక్ టూ.. ట్వీక్ టూ అంటూ సందడి చేసే కలివికోడి కూత వినిపించింది. శేషాచలం అడవుల్లో ఈ అరుదైన పక్షి సజీవంగా ఉన్నట్టు ఆనవాళ్లు దొరికాయి. దీంతో పక్షి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. కలివి కోడి అంటే ఇదో అరుదైన జాతి పక్షిగా పేరుంది. దీని పేరు వినడమే తప్పా చూసిన వాళ్ల సంఖ్య తక్కువే అని చెప్పాలి. కేవలం పైకి ఎగరకుండా భూమి మీద మాత్రమే నడవడం దీని ప్రత్యేకత. రాత్రి పూట మాత్రమే కీకారణ్యంలో సంచరించడం మరో ప్రత్యేక లక్షణం. ఇటువంటి పక్షి ఆనవాళ్లు కనిపించడంతో ఇంతకాలం ఆ పక్షి కోసం సెర్చ్ చేసిన పక్షి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శేషాచలం ఆడవుల్లో..
శేషాచలం.. దట్టమైన అటవీ ప్రాంతం. తూర్పు కనుమల్లో అంతర్భాగం. అంతేకాకుండా విభిన్నమైన జంతు జాతులు, అరుదైన వృక్ష సంపదకు నిలయం. ఇలాంటి ప్రాంతంలో అత్యంత అరుదైన కలివికోడి జాడ వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి (జార్డెన్స్ కోర్సర్) ఆవాసం ఉన్నట్లు తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన బర్డ్ అట్లాస్-2 వేడుక బయటపెట్టింది. మూడు రోజుల క్రితం ఐఐటీ, ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్ వేదికలో దీనిపై చర్చ జరిగింది. ఆంధ్ర బర్డర్స్ మీట్ కలివి కోడి ఆవాసం, లభించిన ఆనవాళ్లను బయట పెట్టింది. ఈ విషయాన్ని ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి బర్డ్ అట్లాస్‌లో స్పష్టం చేశారు.
ఆరు ప్రాంతాల్లో స్పష్టమైన ఆధారాలు..
తాజాగా శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి ఆవాసంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరుగా మొత్తం ఆరుప్రాంతాల్లో దీని ఆధారాలు దొరికాయని, మరో 12 ప్రాంతాల్లో కలివి కోడి తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని వివరించారు. రాత్రి వేళల్లో మాత్రమే కనిపించే కలివి కోడి పొదల్లో దాగి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. పైకి ఎగరలేని పక్షి జాతి కలివి కోడిని అరుపులు, పాద ముద్రలు ఆధారంగా గుర్తిస్తారు. అరుదైన పక్షి జాతి కలివి కోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతోంది. 2005లోనే శేషాచలం ప్రాంతంలో కలివి కోడిని ఎన్‌సీఎఫ్ సంస్థ పరిశోధన శాస్త్రవేత్త జగన్ ఈ పక్షిని తన కెమెరాలో బంధించారు.
కలివికోడి.. ఆసక్తికర విషయాలు..
ఇది కంజు పిట్టలా కనిపించినా పరిమాణంలో దాని కన్నా పెద్దగా ఉంటుంది. కలివి కోళ్లు గులకరాళ్లను సేకరించి వాటి మధ్యలో గుడ్లు పెడతాయి. మెడలో వెండి గొలుసులు వేసుకున్నట్లుగా రెండు తెల్లటి చారలు ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు, పొడవాటి కాళ్లు కలిగి ఉంటాయి. వీటి ఆవాసం ముళ్లపొదలు. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార అన్వేషణ వీటి ప్రత్యేక లక్షణం. దీని కూత ‘ట్విక్ టూ, ట్విక్ టూ’ అన్నట్లుగా ఉండి.. దీని అరుపులు 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తాయి. ఈ కూత కోకిల కూతలా ఉంటుందని అంటున్నారు. అయితే.. అరుదైన కోడిని పట్టుకోవడం, పెంచుకోవడం అంత సులభం కాదంటున్నారు. చిన్న శబ్దం వినిపించినా తాను కట్టుకున్న గూటిలోకి వెళ్లిపోతుందట.. పగలు అసలు కనిపించదు.. అర్ధరాత్రి పూట సంచరించడంతో ఆ చీకట్లో ఆ పక్షిని గుర్తించడం సాధ్యం కాదు. శేషాచలం అడవుల్లో కలివికోడి కూతను రోజూ వింటున్నామని, అయితే.. దాన్ని ఇప్పటి వరకు చూసింది లేదని ఆ ప్రాంతంలో నివశించే గిరిజనులు చెబుతున్నారు.