అత్యంత పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గ‌ణ‌న‌..

అత్యంత పారదర్శకంగా ఇళ్ల జాబితా, ఇళ్ల గ‌ణ‌న‌..

ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సెన్స‌స్ జేడీ జి.ప్ర‌స‌న్న‌కుమార్‌

కంచికచర్ల, ఆంధ్రప్రభ : జన గణన – 2027 ప్రక్రియకు సంబంధించి ద‌శ‌ల వారీగా ప్ర‌క్రియ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో జరుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సెన్స‌స్ జేడీ జి.ప్ర‌స‌న్న‌కుమార్ అన్నారు. క‌లెక్ట‌ర్ లక్ష్మీశ‌, జేడీ ప్ర‌స‌న్న‌కుమార్ శ‌నివారం కంచిక‌చ‌ర్ల‌లో జ‌రుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గ‌ణ‌న (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత క‌చ్చిత‌త్వంతో దోష ర‌హితంగా డేటాను న‌మోదు చేయాల‌ని, మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జనగణన నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

జనగణన అనేది దేశ ప్రగతి, ప్రణాళికా రూపకల్పనకు అత్యంత కీలకమైన ప్రక్రియ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సెన్సస్ జేడీ జి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జనగణనలో ప్రతి సమాచారం విలువైనదని, ప్రజల సహకారంతోనే సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయ‌ని ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న సూచించారు. కార్య‌క్ర‌మంలో వీఎంసీ సెన్స‌స్ ఇంచార్జ్ వెంకటరమణ, రూర‌ల్ ఇన్‌ఛార్జ్ స్వాతి త‌దిత‌రులు పాల్గొన్నారు.