డొంక కదులుతోందా?

డొంక కదులుతోందా?

  • యూకేలో ఉద్యోగాలిప్పిస్తామని డెస్టినీ కన్సల్టెన్సీ భారీ మోసం
  • ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, పాకిస్థాన్ కు చెందిన బాధితులు
  • ఇబ్రహీంపట్నంలో బాధితుడు ఫిర్యాదుతో వెలుగులోకి ప్రముఖ యూట్యూబర్ ఉదంతం
  • యూకే జాబ్.. కోట్లు ఫట్ శీర్షికన మొట్టమొదట ఆంధ్రప్రభలో ప్రత్యేక కథనం
  • నేడు ప్రముఖ ఛానళ్లలో డెస్టినీ కన్సల్టెన్సీ మోసంపై కథనాలు

ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్), ఆంధ్రప్రభ: యూకేలో ఉద్యోగాలిప్పిస్తామని రూ.కోట్లు వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. విదేశాల్లో లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికిన డెస్టినీ కన్సల్టెన్సీ బాధితుల నుంచి పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ చేయించుకుని బోర్డు తిప్పేసింది. దీనిపై పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు ఎం.శివక్రాంతి గత ఏడాది ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

క్రైం నెంబర్ 515/2025 కింద ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ చిత్రం నటి రమా నందన అలియాస్ నందు, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఆయన తండ్రి మోహనరావు లను నిందితులుగా పేర్కొంటూ నవంబర్ 22న కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామంటూ నమ్మించిన నిందితులు రూ.15 లక్షలకు టోకరా వేశారు. బాధితుడు శివ క్రాంతి యూకేలో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండటంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. భారత్ కు చెందిన తమ బ్రాంచిలో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని నిందితుడు మధుకర్ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన క్రాంతి రూ.15 లక్షలు చెల్లించాడు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు నిందితుడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే పోలీసులు సుమారు మూడు నెలల పాటు కేసు నమోదు చేయకుండా బాధితుడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. నిందితులు కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మహిళా మంత్రి, ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించుకోవడంతో కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితుడు కూడా అదే రీతిలో ప్రభుత్వంలోని మంత్రులను, పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఆధారాలు చూపించడంతో పాటు ప్రభుత్వ పెద్దలతో పోలీసులపై ఒత్తిడి చేయించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది.

మొట్టమొదట ఆంధ్రప్రభలో ప్రత్యేక కథనం
బాధితుల నుంచి పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ చేయించుకుని బోర్డు తిప్పేసిన డెస్టినీ కన్సల్టెన్సీ మోసంపై 2025 డిసెంబర్ 28న ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో యూకే జాబ్.. కోట్లు ఫట్ శీర్షికన మొట్టమొదట ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ సంస్థ రసీదులు ఇవ్వకుండా పలు అకౌంట్లలో ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షలు వసూలు చేసినట్లు ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితుడు మధుకర్, ఆయన భార్య ప్రముఖ యూట్యూబ్ రమా నందన అలియాస్ నందు 50 మందికి పైగా నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

బాధితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ తో పాటు పాకిస్థానీయులు కూడా ఉన్నారు. వీరందరికీ సుమారు రూ.70 కోట్ల మేర మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డెస్టినీ కన్సల్టెన్సీ మోసాలపై మీడియాలో కథనాలు రావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్లు సమాచారం. మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో బాధితుడు శివ క్రాంతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్సై బి.రాజు తెలిపారు.

Leave a Reply