51.48cr. | అడ్వెంచర్.. థ్రిల్ సిటీ ! కృష్ణవేణి అలలపై అద్భుత ప్రపంచం!

51.48cr. | అడ్వెంచర్.. థ్రిల్ సిటీ ! కృష్ణవేణి అలలపై అద్భుత ప్రపంచం!
51.48cr. | ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం
అంతర్జాతీయ ప్రమాణాలతో భవానీద్వీపంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు సన్నద్ధం
రూ. 51.48 కోట్ల భారీ పెట్టుబడితో ప్రారంభం
వాటర్ ఫాల్స్, వాటర్ రైడ్స్, అడ్వెంచర్ జోన్స్‌తో పర్యాటకులకు వినోదం
కృష్ణవేణి అలల సవ్వడుల నడుమ ఓ అద్భుత ప్రపంచం ఆవిష్కృతం కానుంది. విజయవాడకు తలమానికంగా ఉన్న భవానీ ద్వీపం వేదికగా మారనుంది. పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం తీసుకువచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అడ్వెంచర్ థ్రిల్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెట్రో నగరాలకే పరిమితమైన వినోదాన్ని నగర ప్రజలకు పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రూ. 51.48 కోట్ల పెట్టుబడితో ఈ భారీ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పార్కు ఏర్పాటైతే భవానీ ద్వీపం సాహస క్రీడల కేంద్రంగా అలరారనుంది.

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవానీ ద్వీపాన్ని పర్యాటకుల స్వర్గథామంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేసింది. సాహస క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రాజెక్టు రూపకల్పన చేసింది.. విశ్వనాథ్ ఐ-వెన్యూస్స ఆధ్వర్యంలో సుమారు రూ. 51.48 కోట్ల భారీ పెట్టుబడితో అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో ఈ ప్రాజెక్టు తీర్చిదిద్దనుంది. రాష్ట్ర పర్యాటక పాలసీ 2024-29 కింద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వినోదానికి చిరునామాగా..
పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈ అడ్వెంచర్ థ్రిల్ సిటీ తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. భవానీ ఐలాండ్ లోని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంటుంది. దీని కోసం ఏపీ పర్యాటక శాఖ 66 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. కృష్ణా నది అలల గలగలల మధ్య, ఆధ్యాత్మికత,సాహస క్రీడల కలయికగా రూపుదిద్దుకోబోతున్న ఈ ‘అడ్వెంచర్ థ్రిల్ సిటీ, విజయవాడను ఒక మకుటాయమానమైన ప్రదేశంగా నిలబెట్టనుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రంగా భవాని ఐలాండ్ విరజిల్లనుంది. వాటర్ అమ్యూజ్‌మెంట్ పార్కు పేరుతో అనేక జల క్రీడలను ఇందులో ఏర్పాటుచేయనున్నారు. అత్యాధునిక వాటర్ పూల్స్, వాటర్ రైడ్స్ సిద్ధం చేస్తారు. అలాగే గో-కార్టింగ్, జిప్‌లైన్, రోప్ కోర్సులు క్లైంబింగ్ వాల్స్ కూడా ఇందులో యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.
స్నో వరల్డ్
భవాని ద్వీపంలో ప్రత్యేకంగా స్నో వరల్డ్ సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. హిమాలయాలను తలపించేలా మంచు పర్వతాల్లో ఉన్నంత హాయిగా ఇక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. మంచులో ఆడుకుంటూ కేరింతలు కొట్టేలా స్నోవరల్డ్ ముస్తాబు చేయనున్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల నమూనాలతో కూడిన మినియేచర్ పార్కు కూడా రూపుదిద్దుకుంటుంది. పర్యాటకుల బస కోసం లగ్జరీ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెస్టారెంట్లు భారీ పార్కింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు.
పెళ్లి వేడుకలకు డెస్టినేషన్..
జీవితంలో ఒకసారి జరిగే వివాహ వేడుకలు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అది ఎక్కడ జరిగితే బాగుంటుందంటూ పలు ప్రణాళికలు రూపొందించుకుంటారు. పెళ్లి బంధాన్ని మధురానుభూతిని పంచేలా భవానీ ద్వీపంలో మూడు ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్లాదరకరంగా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పెళ్లి వేడుకను నిర్వహించుకునే విధంగా తీర్చిదిద్దనున్నారు.
పర్యాటక సర్క్యూట్‌కు ప్రాణం పొసేలా..
ఈ ప్రాజెక్టు అమలైతే పర్యాటక సర్క్యూట్‌కు ప్రాణం పోసుకుంటుంది. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రాక ప్రదేశాలను అనుసంధానిస్తూ రూపొందించిన పర్యాటక సర్క్యూట్ కూడా ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఆలయంతో పాటు ఉండవల్లి గుహలు, కొండపల్లి ఖిల్లా, మూలపాడు నగరవనం వంటి పర్యాటక కేంద్రాలను సందర్శించే వీలు ఏర్పడనుంది.
యువతకు ఉపాధి
ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుతో అనేక మంది యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. హోటల్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ట్రైనర్స్, టెక్నీషియన్స్, సేవా రంగాల్లో సుమారు వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. విదేశీ పర్యాటకుల రాకతో రాష్ట్ర ఖజానాకు విదేశీ మార్పిడి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
