రక్తదానం ప్రాణదానంతో సమానం..
రక్తదానం ప్రాణదానంతో సమానం..
- సామాజిక కార్యకర్త ఆడ వెంకటేష్
జైనూర్, ఆంధ్రప్రభ : మరొకరికి ప్రాణం పోసే గుణం ఒక్క రక్తదానానికి మాత్రమే ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, సికిల్ సెల్, ఆదివాసి మిత్ర అసిఫాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఆయన ఈ సందర్భంగా సమాజంలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి, యువతను భాగస్వామ్యం చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని,అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు.ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సార్లు రక్తదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలిని కోరారు.రోడ్డు ప్రమాద బాధితులకు, గర్భిణీలకు, తలసేమియా రోగులకు యువత ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుంది అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానంపై అవగాహన తక్కువగా ఉందని,అందుకే తాము నిరంతరం అవగాహన సదస్సులు, ఉచిత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అత్యవసర సమయాల్లో రక్తం కావలసిన వారికి దాతలను సమకూర్చేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను కూడా నడుపుతున్నట్లు వివరించారు.మారుముల ఏజెన్సీ ప్రాంతాలలో కెరామేరీ, సిర్పూర్ యు, జైనూర్, లింగాపూర్ మండలాలలో 1990 నుంచి ఇప్పటివరకు 98 సార్లు ఉచిత రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
సామాజిక బాధ్యత కలిగిన యువత మరియు ప్రభుత్వ ఉద్యోగాల సహకారంతో ఇప్పటివరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మన రక్తంలో ప్రతి బొట్టూ మరొకరి జీవితంలో వెలుగులు నింపగలదు” అని ఆడ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, తోటి ప్రాణాలను కాపాడే మానవతావాదులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు.
