Battery Explosion | ఆసక్తి విషాదమైంది.. గూడెంలో 14 ఏళ్ల లోకేష్ మృతి

Battery Explosion | సిర్పూర్ (టీ)/చింతలమానేపల్లి, ఆంధ్రప్రభ : కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి.. ఇంట్లోనే చిన్న చిన్న పరికరాలు తయారు చేయాలనే ప్రయత్నం.. చివరకు అదే ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి గణేష్–శారద దంపతుల కుమారుడు లోకేష్ (14) బుధవారం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తుల కథనం ప్రకారం, లోకేష్ బుధవారం ఉదయం ఇంట్లో గుర్తుతెలియని బ్యాటరీలు, ఇతర వస్తువులతో ఏదో పరికరాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీ భారీ శబ్దంతో పేలింది. పేలుడు ధాటికి అతని ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే లోకేష్ మృతి చెందినట్లు తెలిపారు.
పెద్ద కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. ఇంట్లో నవ్వులు నింపిన బాలుడు ఒక్కసారిగా లేకపోవడంతో గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా పెద్దలు, స్థానికులు చిన్నారులు విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు లేదా తెలియని ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రయోగాలు చేయకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే ఇలాంటి తీవ్ర విషాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.