విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి..

సివిల్ జడ్జి పర్వతపు రవికుమార్

చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని, దానిని సాధించేందుకు కృషి చేస్తేనే జీవితంలో విజయాలు సాధించగలరని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు సివిల్ జడ్జి పర్వతపు రవికుమార్ అన్నారు.

మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కొందరు వ్యక్తులు ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటంతో పాటు తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా మోసపోకుండా చైతన్యం కల్పించాలని సూచించారు.

విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం కష్టపడాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకుని అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎస్సై శ్యామ్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.