పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి..

పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి..

  • కలెక్టర్‌కు నవాబ్‌పేట్ రైతుల వినతి

కడెం, ఆంధ్రప్రభ : గిరిజనేతర రైతుల పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబ్‌పేట్ గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు.

మండలంలోని నవాబ్‌పేట్ శివారులో గల సర్వే నంబర్ 110లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న తమ భూముల సాగుకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. అటవీ అధికారులు తమ భూముల గుండా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో తాము సాగు చేస్తున్న భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

తమ భూములపై హక్కులను పరిరక్షిస్తూ, సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయడంతో పాటు భూములకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నవాబ్‌పేట్ గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.