జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో…
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి:
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు.
వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగరాదని, చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని, పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు, వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించవద్దని సూచించారు. అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని, వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించవద్దని పేర్కొన్నారు.
వరద ప్రాంతాలు, వాగులు, చెరువులు, జలపాతాల వద్ద సెల్ఫీలు, రీల్స్ కోసం వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని హెచ్చరించిన ఎస్పీ, జిల్లా ప్రజలందరూ పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
