​ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం..

వేదిక, జర్మన్ హ్యాంగెర్లు, కంట్రోల్ రూమ్ సిద్ధం
ఎస్పీజీ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత

విజయనగరం, ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రారంభోత్సవానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో పనులను మరింత వేగవంతం చేశారు. నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం, జీఎంఆర్ సంస్థ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి.

ప్రధాని పాల్గొనే బహిరంగ సభ కోసం ప్రధాన వేదిక నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. సభకు హాజరయ్యే ప్రజల కోసం భారీ జర్మన్ హ్యాంగెర్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఎర్పాట్ల పర్యవేక్షణ కోసం సమీపంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను బుధవారం ప్రారంభించారు. వీఐపీలు, ప్రజల వాహనాల కోసం వేర్వేరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ అధికారులు భద్రతా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.