సబ్బితం జలపాతం సందర్శనకు తాత్కాలిక బ్రేక్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సబ్బితం గ్రామ పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గౌరీ గుండాల జలపాతం సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జలపాతం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా గ్రామ ప్రవేశం వద్ద భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకులను అనుమతించడం లేదు. డీఎల్‌పీఓ దేవకీ దేవి, మండల పంచాయతీ అధికారి కిరణ్ గురువారం జలపాతం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బారికేడ్లను దాటి జలపాతం పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మాత్రమే జలపాతాన్ని తిరిగి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి భద్రతా నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూనె సరోజన, ఉప సర్పంచ్ ఇండ్ల మహేందర్, పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇండ్ల రమేష్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
