వర్ష బీభత్సం.. జాతీయ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షం

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా గురువారం మండల కేంద్రంలోని గ్రీన్ సిటీ వెంచర్ సమీపంలో జాతీయ రహదారి–63పై భారీ వృక్షం నేలకొరిగింది. రహదారికి అడ్డంగా చెట్టు పడటంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇది ప్రధాన జాతీయ రహదారి కావడంతో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే చెట్టు కూలిన సమయంలో ఆ మార్గంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు చెట్టును తొలగించి రాకపోకలు సాధారణ స్థితికి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.