కడెం ప్రాజెక్టు వరద పరిస్థితులపై అధికారుల సమీక్ష
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లాలో మొన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం కడెం ప్రాజెక్టును సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్‌ఫ్లో, వరద ప్రవాహం, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, ప్రజల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టు వద్ద చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించిన అధికారులు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో డీఆర్‌డీఓ పీడీ విజయలక్ష్మి, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, కడెం మండల తహసీల్దార్, ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈ, కడెం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
