Nara Lokesh | ఇప్పుడే హామీ ఇవ్వలేం..
డీలిమిటేషన్ అనంతరమే అంశం పరిశీలన
జిల్లా సాధన జేఏసీ ప్రతినిధులతో సమావేశంలో స్పష్టీకరణ
Nara Lokesh | పత్తికొండ, జూలై 30 (ఆంధ్రప్రభ): ఆదోని జిల్లా ఏర్పాటుపై ప్రస్తుతం ఎలాంటి హామీ ఇవ్వలేమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదోని జిల్లా సాధన జేఏసీ ప్రతినిధులు జిల్లా ఏర్పాటుకు సంబంధించి చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఆయన, ఈ అంశాన్ని నియోజకవర్గాల డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో గతంలో మంత్రి నిమ్మల రామానాయుడితో కూడా చర్చించామని, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తయిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
జిల్లా సాధన జేఏసీ ప్రతినిధులు ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ప్రస్తుత పరిస్థితుల్లో హామీ ఇవ్వడం సాధ్యం కాదని, డీలిమిటేషన్ అనంతరం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని లోకేశ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
