కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటింటా విస్తృత ప్రచారం

కోటబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మంత్రి, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, పేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆ పరిస్థితులకు ముగింపు పలికి అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ స్వర్ణయుగం వైపు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కట్టుబడి ఉన్నామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతోందని తెలిపారు.

మంత్రి పర్యటన సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువగా పనిచేస్తున్న ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.