మెరుగైన వైద్యం, విద్య, పరిపాలన అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్యం, విద్య, పరిపాలన అందించడమే లక్ష్యం

  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్రప్రభ:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, పరిపాలన అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.

బుధవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో పాటు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పనులు పూర్తయ్యే నాటికి వైద్య పరికరాలు, మెడికల్ మరియు పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

వచ్చే దసరా నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్ పనులను కూడా పరిశీలించి, డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని సూచించారు.

భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆయన ఆదేశించారు. భవన నమూనా పోస్టర్‌ను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, పరిపాలన, విద్య అందించేందుకు 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్‌తో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, అధికార ప్రతినిధి బలిదే వెంకన్న, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply